కంచే చేను మేస్తున్నదా, చేనే కంచని పెంచి పోషిస్తున్నదా? ఈ యక్ష ప్రశ్న కి సమాధానం తెలిసి చెప్పక పోయారో మీ తలలు వేయి వక్కలైపోవు కాని, అవినీతి బురదలో పీకల్లోతుకు కూరుకు పోతారని శపిస్తున్నాను.
సరే ఈ సమాధానం కోసం మీరాలోచిస్తుండండి, ఈలోగా మీ ఆలోచన పదునెక్కడానికి ఒక చిన్న కధ చెబుతాను. మీకు తెలిసిన కధే, అయినా ఎందుకో చెప్పాలని పిస్తున్నది.
ఒక అడవిలో ఒక చెరువున్నదిట. ఆ చెరువులో చేపలు ఆడుతూ పాడుతూ కాలం గడిపేవట. ఎండాకాలం కూడా ఎండిపోని ఆ చెరువును చూసి ఓ కొంగ రొట్టలేసుకంటూ తన టికానాని అక్కడికి మార్చేసింది. ఇంకేముంది పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్, మధ్యాన్నం లంచి, రాత్రికి డిన్నర్. ఎక్కువ శ్రమ పడకుండా తన బొజ్జ నింపుకోవటం మొదలు పెట్టిందా కొంగ.
రోజురోజు కి తగ్గిపోతున్న తమ చాపల సంఖ్యని చూసి, ముఖ్యంగా పసి చేపల తరుగుదల చూసి, జరుగుతున్న విషయాన్ని గమనించిన పెద్ద చేపలు, తమ సంతతిని ఆ కొంగ జోలికి పోకుండా కాపలా కాయటం మొదలు పెట్టయట .
కొంగకి రెండు రోజులు ఆహారం దొరకలేదు. ఏమయిందబ్బా, నిన్నటి దాకా నా ముక్కు దగ్గరకొచ్చి నన్ను శ్రమ పెట్టకుండా ఆహారాన్ని అందించిన చేపలు, రెండు రోజులుగా ఒక్కటి కూడా కను చూపు మేరలో కనిపించటంలేదు అంటూ వాపోయింది. కిం కర్తవ్యం అంటూ ఆలోచించిది.
అలా ఆలోచిస్తున్న కొంగ కి పొరపాటున దారి తప్పి వచ్చిన ఓ చిన్నారి చేప పిల్ల కనిపించిది. కొంగ ని చూడగానే అది చలి జ్వరం వచ్చి నట్లు వాణక సాగింది. వెంటనే కొంగ చేపని పిలిచి ఎందుకు నన్ను చూసి అలా వణికి పోతున్నావు. నేను ఇదివరకిటి కొంగ ని కాదు. సంన్యాసం తీసుకున్నాను. ఏదో ఆకులు అలములు తప్ప, చేపల జోలికి పోను. నన్ను నమ్ము. రండి, ఈ రోజు నుండి మనం కలసి ఆడుకుం దాము.
కొంగ దగ్గరకి పోయి ప్రాణాలతో తిరిగి వచ్చిన చిన్న చేపని చూసి పెద్ద చాపలు సంతోషించటమే కాక కొంగ లో దైవత్వాన్ని చూశాయి. ఆ రోజు నుండి నిర్భయంగా కొంగ చుట్టూ దొంగా పోలీస్ ఆట ఆడుకుంటూ కాలం గడప సాగినాయి. కాని దొంగ సన్యాసి కొంగ, దొంగ చాటుగా ఒక్కొక్క చాపని కృష్ణార్పణం చేయటం మొదలు పెట్టింది, మిగతా చాపలకి అనుమానం రాకుండా.
ఈ కధంతా మీరెప్పుడో చడ్డీలు తొడుక్కొని జీడీలు చీక్కొనే రోజుల్లోనే విన్నారని నాకు తెల్సు. తెల్సినా ఎందుకు చెబుతున్నవంటారా?
గత కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారాలని చూస్తుంటే ఎందుకో ఈ కధ చెప్పాలనిపించింది. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలకి ఎజమాని, తన ఫాక్టరీలో కార్మికులకు సరిగా వేతనాలివ్వని పెట్టుబడిదారుడు, స్కాట్ లాండో ఎక్కడో ఓ ఐ లాండు కి అధిపతి ఐన ఓ సన్యాసి, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాదుట. రాజకీయ నాయకులను దగ్గరగా రానివ్వనంటూ హటం వేసిన హజారే, ఆ సన్యాసికి, రాజకీయ పార్టీ పెడతానంటూ గడ్డం మెలేసే పెద్ద మనిషికి, పెద్ద పత్తిత్తుల్లా బి జే పి వాళ్ళు కౌగిలించు కుంటున్నా సమర్ధించటం చూస్తుంటే ఏమనుకోవాలి.
అదటు వుంచితే ఇక పుట్టపర్తి బాబా సంగతి యేమని చెప్పాలి. ఓ దేవుడి సన్నిధి లోనే దోపిడీ దారులు రాజ్యమేలారని చెప్పాలా? లేక దేవుడే వారిని పెంచి పోషించారని చెప్పాలా? అమ్మో ఇలా అంటున్నానేమిటి? నా కళ్ళు పోవు?
ఇవన్నీ చూసినా ప్రజలు దొంగ సన్యాసులని నమ్ముతూనే ఉంటాం మరి. రాజ్యాలనేలే ప్రధానులు మొదలు పెద్ద పదవులెలగ పెడుతున్న వాళ్ళందరూ, పాదాలమీద పడి మరీ సన్యాలుసులకు పాదాభివందనం చేస్తుంటే, పవిత్రమైన పుట్టపర్తి రాగానే విమానంలోనే వినయంగా సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటే, వేలిముద్ర గాళ్ళం, నమ్మక చస్తామా మరి.
దొంగ తపస్సులు చేసే కొంగలూ వుంటాయి. అటువంటి కొంగలని ఆశ్రయించుకొని మండ్రుగబ్బలు, నీటి పాములు అవకాశం కోసరం ఆరాట పడుతుంటాయని ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నది. అందుకే అంటున్నా, బాబాలతో హోషియార్, జాగ్తే రహొ.
==========






